నగరపంచాయతీ ప్రతిపాదనకు బ్రేక్…. తెరవెనుక అసలేం జరుగుతుంది?
రాజకీయ ప్రయోజనాలే అడ్డంకులుగా మారాయా?
కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం పంచాయతీల విలినమే ఆలస్యానికి కారణమా?
అధికారులు వివరణ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?
ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయా లేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 50గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకుగాను పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసి ఆగస్టు 5వతేది లోగా రాష్ట్ర సచివాలయానికి పంపించాలని జులైలో ఆదేశాలను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పొదిలి గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు కావలసిన పూర్తి సమాచారాన్ని పొదిలి పంచాయతీ అధికారులు జిల్లా అధికారులకు అందజేశారు.
అయితే జిల్లా అధికారుల వద్దనుండి ఇప్పటివరకు రాష్ట్ర సచివాలయానికి పొదిలి పంచాయతీకి సంబంధించిన వివరాలు చేరాయా లేదా అనేది ఓ ప్రశ్నగా మారింది. కాగా ఓ స్థానిక ప్రజాప్రతినిధి కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేసేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని చేసిన ఒత్తిడి మేరకు ఆగస్టు 5లోగా పంపించాల్సిన సమాచారాన్ని ఆగస్టు చివరివారంలో పంపగా…. పలు ప్రభుత్వ కార్యక్రమాల వలన జిల్లా అధికారులు ఇప్పటివరకు పరిశీలించలేదని…. గ్రామ పంచాయతీ, గ్రామసభ తీర్మానాలు లేకపోవడంతో దస్త్రాలు సరిగా లేవని జిల్లా అధికారులు తిప్పి పంపించగా…. యుద్ధప్రాతిపదికన దస్త్రాలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం.
ఇదంతా చూస్తుంటే ఇప్పటివరకు పొదిలి పంచాయతీకి సంబంధించిన వివరాలు సచివాలయానికి చేరలేదనే అనిపిస్తుండగా…. సంబంధిత అధికారులు మాత్రం సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
అయితే నగర పంచాయతీ ఏర్పాటు ప్రతిపాదనలకు బ్రేక్ పడడానికి ఆ 3పంచాయతీలే ప్రధాన కారణంగా కనిపిస్తుండగా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా జాప్యం జరుగుతోందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.