పిచ్చిరెడ్డి కాలనీలో కేటాయించిన పట్టాలను రద్దుచేసి పేదలకు పంపిణీ చేయండి : ఆర్డీవో
పిచ్చిరెడ్డి కాలనీలో కేటాయించిన పట్టాలను రద్దుచేసి పేదలకు పంపిణీ చేయాలని తహశీల్దార్ ను ఆర్డీవో ఆదేశించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం నుండి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్డీవో కెవి రామారావు తొలుత రైల్వే భూములను పరిశీలించిన అనంతరం సాయంత్రం మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేసి నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పొదిలిటైమ్స్ తో ఆయన మాట్లాడుతూ స్థానిక విశ్వనాధపురంలోని పిచ్చిరెడ్డి కాలనీలో గతంలో కేటాయించిన ఇంటి స్థలాలలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టని కారణంగా వాటిని రద్దు చేసి ఆ స్థలాలను పేదలకు పంపిణీ చేయమని తహశీల్దార్ కు ఆదేశాలిచ్చామని పొదిలిటైమ్స్ కు తెలిపారు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విద్యాసాగారుడు, డిప్యూటీ తహశీల్దార్ జానీబేగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, విఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.