సామాజిక మాధ్యమం ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా కేసును చేధించిన పోలీసులకు రివార్డు
ఫేస్ బుక్ సామాజిక మాధ్యమం ద్వారా క్రైస్తవ మత ప్రచారకుడుగా చలామణి అవుతూ అమాయక ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పొదిలి పోలీసులు గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే నైజీరియాకు చెందిన ఒయంకో హైజినిస్ అలియాస్ పీటర్ డానియల్ అనే వ్యక్తి 2012సంవత్సరంలో ఫుట్ బాల్ కోచ్ గా ఇండియాకు వచ్చానని చెప్పుకుంటూ వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉండడంతో 2015ల్ఓ ఫారినర్స్ యాక్టు-14కింద అరెస్టు చేసి జైలుకు పంపగా……. జైలునుండి రెండు సంవత్సరాల తరువాత బయటికి వచ్చిన ఒయంకో మోసం చేయడమే వృత్తిగా ఎంచుకుని టిబి జాషువా మినిస్ట్రీస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ప్రారంభించి అమాయక ప్రజలను బుట్టలో వేసుకుని వారి కుటుంబానికి ప్రార్ధన చేస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలో పొదిలి బాప్టిస్టుపాలెంకు చెందిన వేల్పుల అచ్చయ్య అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ టిబి జాషువా అనే ఫేస్ బుక్ పేజీని ఫాలో అవుతూ చాటింగ్ చేయగా భారతదేశంలో అనేక చర్చిలు, ఆసుపత్రిలు నిర్మించేందుకుగాను 2.4మిలియన్ డాలర్లు తీసుకుని వస్తున్నామని…… మాకు సహకరిస్తే 20శాతం కమిషన్ ఇస్తామని నమ్మించి……. మొదట ఇండియాకు చేరుకున్నామని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డామని కొంత నగదు అకౌంట్ లో వేయాలని అచ్చయ్య కొంత నగదు జమచేశాడు.
అనంతరం పలుమార్లు బ్యాంకులు, ఇన్కమ్ టాక్స్, వంటి పలురకాల క్లియరెన్స్ లు కావాలని పలుమార్లు అచ్చయ్య 14లక్షల 67వేల రూపాయలు పలు అకౌంట్లలో జమచేశాడు.
కొద్దిరోజుల తర్వాత తాను మోసపోయానని గ్రహించిన అచ్చయ్య పొదిలి పోలీసులను ఆశ్రయించగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిఐ శ్రీరామ్ దర్యాప్తు ప్రారంభించారు.
అనేక సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు కొనకనమిట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో కేసును ఛేదించి ముద్దాయిలు ఒయంకో హైజినిస్, షహీద్ ఖాన్, మొహమ్మద్ యాకుబ్ లను అరెస్టు చేసి వారివద్ద 5సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు, 22చెక్ బుక్స్, నైజీరియా పౌరసత్వ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పాత్రలపై విచారణ జరపవలసి ఉంది…. వీరి బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కోరుతూ సంబంధిత బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభాపాటవాలు చూపిన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీరామ్, పొదిలి ఎస్ఐ సురేష్, కొనకమిట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్, కానిస్టేబుళ్లు శివ, షేక్షావలిలు బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నందు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.