ఘనంగా తెలుగుభాషా దినోత్సవ వేడుకలు

తెలుగుభాషా దినోత్సవ వేడుకలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పెద్దబస్టాండులోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన తెలుగుభాషా దినోత్సవ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ జిల్లా అధికారులు ముఖ్యఅతిథిలుగా పాల్గొని విద్యార్థులకు మాతృభాష యొక్క ఆవశ్యకతను వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ, సాంస్కృతిక వంటి వివిధ రకాల పోటీలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాటశాలల విభాగం జిల్లా కోఆర్డినేటర్ గీతామాధురి మాట్లాడుతూ తెలుగుభాషా వ్యవహారిక పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 156వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు తెలుగుభాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని….. తెలుగుభాషా శాస్త్రజ్ఞులలో మొదటి శాస్త్రజ్ఞులు అయిన గిడుగు రామమూర్తి తెలుగుప్రజలకు స్వాతంత్ర్యం ఎంత అవసరమో మాతృభాష అయిన తెలుగు కూడా అంతే అవసరమని…. మాతృభాషను మర్చిపోతే మాతృమూర్తిని మర్చిపోయినట్లే అని ఆమె అన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ పాఠశాలల నుండి 150మంది విద్యార్థులు, 70మంది ఉపాధ్యాయులు పాల్గొని తెలుగుభాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని…. దేశభాషలలో మన మాతృభాష అయిన తెలుగుభాష యొక్క గొప్పదనం గుర్తుచేసుకునేలా గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని మన తెలుగువారు పండుగలా నిర్వహించుకునే రోజు ఈ రోజు అని….. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పద్యపఠనం పోటీలు, బృందచర్చా కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకఆకర్షణగా నిలిచాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మండల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.