వాహ్…కోహ్లీ…వాహ్

వాహ్… కోహ్లీ… వాహ్ ఇది మా మాట కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అంటున్న మాట ఇది.
నిజంగా.. కనీవినీ ఎరగని చరిత్రే ఇది. కేవలం 213 వన్డేల్లో 10,000 పరుగులు సాధించడమంటే కనీవినీ ఎరగని చరిత్ర కాక మరింకేమిటీ! పరుగుల రారాజుగా కీర్తించే సచిన్‌ తెందుల్కర్‌కే సాధ్యమవ్వని ఘనత ఇది. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయి చేరడమంటే మాటలా? ఎంత నిలకడ.. ఎంత దూకుడు.. ఎంత టెక్నిక్‌.. ఎంత ఓర్పు.. ఎంత శ్రమ.. ఎంత కోరిక.. ఎంత కసి.. చెప్పుకొంటూ పోతే ఇలా ఎన్ని ‘ఎంతలు’ వచ్చేస్తాయో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ గురించి.

సచిన్‌ పరుగుల వరదను చూసి ఇలాంటి ఆటగాడు మరొకరు వస్తారా? అనుకున్నారు. ఆ రికార్డులు బద్దలు కొట్టే ఇంకో వీరుడిని చూడగలమా? అని సందేహించారు! 2008లో అండర్‌-19 ప్రపంచకప్‌ అందించి టీమిండియాలోకి అడుగుపెట్టిన కుర్ర కోహ్లీని చూసి అరె బాగా ఆడుతున్నాడే అనుకున్నారు అంతా! అతడే తనలో ఎన్నో మార్పులు చేసుకొని ఈనాడు ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా సచిన్‌ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ ఔరా! అనిపిస్తాడని ఊహించలేకపోయారు.

 

తొలి పది మ్యాచుల్లో తన అసలైన ప్రతిభ చూపని కోహ్లీ ఆ తర్వాత చిచ్చర పిడుగులా చెలరేగాడు. మైదానంలో సునామీ సృష్టించాడు. బౌలర్‌ ఎవరన్న చూసేది లేదు. ఉపఖండమా? ఆస్ట్రేలియా? ఇంగ్లాండా? దక్షిణాఫ్రికానా? అన్న భయం లేదు. విమర్శలనే ఇటుకలను ఒక్కో మెట్టుగా పేర్చాడు. తనను తాను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకున్నాడు. సచిన్‌తో పోల్చేలా ఆడాడు. ఇప్పుడు సచిన్‌ పదివేల పరుగుల రికార్డునూ తుడిచిపెట్టేశాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 81 పరుగులు చేసి అత్యంత వేగంగా అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల శిఖరాన్ని అధిరోహించిన క్రికెట్‌ యోధుడిగా మరో చరిత్ర సృష్టించాడు. తన ఆరాధ్యదైవం సచిన్‌ 266 వన్డేల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీ కేవలం 213 మాత్రమే తీసుకోవడం విశేషం.

పదివేల పరుగుల వీరులు
* విరాట్‌ కోహ్లీ (213 వన్డేలు- భారత్‌)
* సచిన్‌ తెందుల్కర్‌ (266- భారత్‌)
* సౌరవ్‌ గంగూలీ (272- భారత్‌)
* రికీ పాంటింగ్‌ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్‌ కలిస్‌ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్‌ ధోనీ (320- భారత్‌)
* బ్రియన్‌ లారా (287- వెస్టిండీస్‌)
* రాహుల్‌ ద్రవిడ్‌ (309- భారత్‌)