హామీలు నెరవేర్చి జగన్ కూడా వైఎస్ఆర్ లా ముదిరాజుల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలి : ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు
ముదిరాజుల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక రహదారులు భవనముల అతిథిగృహంలో గురువారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర బిసి జనాభాలో 10వ స్థానంలో ఉన్న ముదిరాజులకు ప్రజాసంకల్ప పాదయాత్రలో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని…… ఒక ఎం ఎల్ సి ఇస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు.
2009 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా”వైఎస్ రాజశేఖరరెడ్డి ముదిరాజ్ లకు (బిసి-ఏ) కేటగిరీలో చేరుస్తూ జీఓ నెంబరు 15 జారీచేసి ముదిరాజ్ లకు ఆరాధ్యదైవంలా నిలిచారని…… అదేవిధంగా 20లక్షలకు పైగా జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని….. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని సమర్థులకు కేటాయించి వైఎస్ఆర్ లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముదిరాజుల చిరస్థాయిగా నిలవాలని అన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను విస్మరించిన ఫలితంగా 2019 ఎన్నికలలో ఓటమి చవిచూడడం జరిగిందని విమర్శించారు……. అలాగే బిసిలకు సంబంధించి ఇచ్చిన హామీలను విప్లవాత్మక నిర్ణయాలతో అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్ 2020ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈర్ల గురవయ్య, విద్యార్థి నాయకులు నరసింహారావు, విజయవాడ సిటీ నాయకులు ఆత్మకూరి సురేష్, బివి నారాయణ, కోటేశ్వరరావు, వేణుగోపాల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.