అవినీతి రహిత పాలనే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం – జిల్లా కన్వీనర్ సుదర్శన్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
దేశ రాష్ట్ర కుటిల రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీతో బుద్ధి చెబుతామని, అవినీతి రహత పాలనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిందని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వేశపోగు సుదర్శన్ అన్నారు.
మంగళవారం నాడు స్థానిక పొదిలి, కొనకనమిట్ల మండల కేంద్రాలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా రాజకీయ ప్రజా చైతన్య యాత్ర మూడవ రోజు కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతూ ప్రజల కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం, త్రాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులైన నాయకులు పనిచేయటం లేదని సుదర్శన్ అన్నారు.
జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని, ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నారు.
దొనకొండ పారిశ్రామిక కారిడారును గాలికొదిలారని, కనిగిరి నిమ్జ్ అతీ గతి లేదని, ప్రధానమైన త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపటం లేదని చట్ట సభలలో ప్రజా సమస్యలు చర్చకు రావటం లేదన్నారు.
రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు అంతేలేకుండా పోయిందని, మహిళలకు భద్రత కరువైందని దుయ్యబట్టరు.
ఆమ్ ఆద్మీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని,ప్రజా సేవకులందరు ఉచిత టోల్ ఫ్రీ నెంబరు 1800 419 7874 కు ఫోన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని కోరారు.
గ్రామాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం నిర్వహిస్తూ గోడ పత్రికలు అంటించి, కరపత్రాల పంచుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం నాయకులు తంగిరాల యేసురత్నం, గిద్దలూరు నియోజకవర్గం నాయకులు కమ్మిశెట్టి భాస్కరరావు, యర్రగొండపాలెం నియోజకవర్గం నాయకులు జి.కిషోర్ కుమార్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.