మతోన్మాద బీజేపీ సర్కారును గద్దె దించాలి-ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పాశం పిలుపు
టైమ్స్ మీడియా రాజధాని ప్రతినిధి
కేంద్రంలో రాజ్యమేలుతున్న మతోన్మాద బీజేపీ సర్కారును గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు పిలిపునిచ్చారు.
గురువారం విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పాశం ప్రమాణం చేశాక పార్టీ నాయకులు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మతం, కులం ఆయాధాలుగా వాడుకుని బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తన ప్రజా వ్యతిరేక విధానాలతో ధనికులపై 4%, పేదలపై 17% పన్నులు విధించిందని ఆయన దుయ్యబట్టారు.
మధు బొట్టా యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్పీ నేత ప్రమాణ స్వీకార కార్యక్రమం సభలో వెంకటేశ్వర్లు ప్రసంగం ఆయన మాటల్లోనే…‘‘ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారు. 2014లో రూ.400 ఉన్న వంటగ్యాసు ధరను రూ.1200 వరకూ పెంచి 2024 లోక్ సభ ఎన్నికలకు 9 నెలల ముందు రూ.200 తగ్గించి ప్రజలను దగా చేయడానికి బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీని అమలు చేయకపోవడమేగాక విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నారు. సముద్రతీరం ఎక్కువ ఉన్న ఏపీలో కేంద్ర సర్కారు పోర్టులు నిర్మించకుండా రాష్ట్ర ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న పోర్టులను అదానీ గ్రూపునకు సొంతమయ్యేలా చేస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైనన్ని నిధులు కేంద్రం కేటాయించకుండా నిర్మాణం నత్తనడకన సాగేలా చేస్తోంది.
హోదా డిమాండును పక్కనపెట్టి మోదీ సర్కారుకు దాసోహమంటున్న ఏపీ ప్రభుత్వం
‘‘ఏపీకి ప్రత్యేక హోదా డిమాండును పక్కనబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోలేకపోతోంది. కొత్త ప్రాజెక్టుట తీసుకురాలేక చతికలబడుతోంది. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్ రద్దు చేయలేదు. జాబ్ కేలండర్ ప్రకటన మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర సర్కారు నానా ఇబ్బందులు పెడుతూ ఉద్యోగ సంఘాల నేతలను తీవ్రంగా వేధిస్తోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే వైఎస్సార్సీపీ సర్కారు రైతులకు సబ్సిడీలు నిలిపివేసింది. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రద్దుచేసింది. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు, సరఫరాలో కూడా సబ్సిడీలు ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన సర్కారు రాష్ట్రంలో గంజాయి సాగును పరోక్షంగా ప్రోత్సహిస్తూ యువతను మత్తుకు బానిసలుగా చేస్తోంది.
ముస్లింలు, దళితులపై దాడులు పెరిగాయి
‘‘కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జాతుల మధ్య పోరాటాన్ని ఎగదోస్తూ, మారణహోమం ఆగకుండా బీజేపీ కుట్రలు పన్నుతోంది. తెలుగు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటూనే కేంద్రంలోని బీజేపీ సర్కారు అడుగులకు మడుగులొత్తుతున్నాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది,’’ అని పాశం వెంకటేశ్వర్లు తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. సోషలిస్టు సిద్ధాంతాలను ఆచరణలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు.
నూతన కార్యవర్గం ప్రమాణం
ఎస్పీ ఏపీ శాఖ నూతన అధ్యక్షుడిగా పాశం ప్రమాణం
గురువారం నాడు విజయవాడ లోని బాలోత్సవ భవన్ నందు జరిగిన బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూతన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు చేత మధు ప్రమాణస్వీకారం చేయించారు.
పార్టీ విస్తరణకు సహకరిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కు మధు బొట్టా యాదవ్ కృతజ్ఞలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యర్రగడ్డ నాగరాజు , అంగడాల పూర్ణచంద్రరావు, భాస్కర్ గౌడ్, బండారు సోమరాజు, షేక్ ఫరీదాబీ, తేజోవతి, శాఖమూరి సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు జగదీష్ యాదవ్ నూతన అధ్యక్షడు వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు