బాల్య వివాహాలు పట్ల అవగాహన కల్పించాలి – న్యాయమూర్తి భార్గవి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చుని పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భార్గవి అన్నారు.
సోమవారం నాడు స్థానిక కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం నందు మండల న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, బాలకార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో విచారిస్తే బాల్య వివాహాలు అధిక సంఖ్యలో జరుగుతున్నయిని స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిని గమనిస్తే దేశంలో బాలుర కంటే బాలికల సంఖ్య చాల తక్కువగా ఉందని, భ్రూణహత్యలకు పాల్పడడం కూడా దీనికి కారణమన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్ల వివాహాలకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని న్యాయమూర్తి భార్గవి అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బొడగిరి వెంకటేశ్వర్లు, అనీల్ బాబు, ప్రవీణ్ కుమార్,హర్ష చక్రవర్తి, కిషోర్ బాబు, మహిళా న్యాయవాదులు పి జ్ఞాన కుమారి, గౌతమి, పారా లీగల్ వాలంటీర్ ఆదిలక్ష్మి మరియు కళాశాల, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు