మట్టి సేకరణ పరీక్షపై శిక్షణ తరగతులు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి మండలంలోని కంబాలపాడు రైతు భరోసా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సహాయకులకు మట్టి పరీక్ష సేకరణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా  దర్శి సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు డి నిర్మల  మాట్లాడుతూ వేసవికాలంలో పొలాల్లో పంట లేకుండా ఖాళీగా ఉంటాయి కావున రైతులందరూ మట్టి పరీక్షలు చేయించుకోవాలని  మట్టి నమూనాల సేకరణలో మెలుకువల గురించి మరియు ఎరువులు కంపోస్టు ఇతర పోషక పదార్థాలు వేసిన నేలల్లో 45 రోజుల వరకు మట్టి నమూనా సేకరించకూడదన్నారు.

చెట్ల కింద,గట్ల వద్ద ,కంచెల దగ్గర, కాలిబాటల్లో బాగా సారవంతమైన నేలలు లేదా నిస్సారవంతమైన చోట్ల మట్టి నమూనాల సేకరించకూడదని చౌడు భూముల్లో నమూనాలను విడివిడిగా తీయాలన్నారు.

సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుండి మట్టి నమూనాలు సేకరించకూడదు.

అలా తీయవలసి వస్తే నమూనాలను నీడలో ఆరబెట్టి పరీక్షకు పంపించాలన్నారు.

మట్టి నమూనా సేకరించే పొలంలో పది నుండి 12 చోట్ల ముందుగానే పై భాగంలో చెత్తాచెదారం లేకుండా తీసివేయాలి అన్నారు.

పారా లేదా పలుగు ఉపయోగించి V ఆకారంలో గుంత తీయాలన్నారు. పండ్ల తోటలు వేసే పొలంలో ఎంపిక చేసిన ప్రదేశంలో ఆరడుగులు గొయ్యి తీసి ప్రతి అడుగుకి పై నుండి కిందకు ఒక మట్టి నమూనా చొప్పున సేకరించి పరీక్షా కేంద్రానికి పంపాలన్నారు.

పొదిలి మండల వ్యవసాయ అధికారి గారు జైనులుబ్దిన్ గారు మాట్లాడుతూ మట్టి నమూనా సేకరించిన తర్వాత క్వార్టరింగ్ పద్ధతి ద్వారా వారు అరకేజీ మట్టి వచ్చేవరకు తీసి పాలిథిన్ కవర్లో వేయాలన్నారు. ఎరువులకు ఉపయోగించే గోనె సంచులు లేదా ఇతర గోతాలను మట్టి నమూనా సేకరణకు వినియోగించకూడదన్నారు. నమూనా తో పాటు రైతు పేరు పొలము విస్తీర్ణం సర్వే నెంబరు గతంలో వేసిన పైరు వేయబోయే పైరు వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

మట్టి పరీక్ష ఫలితాలు వచ్చిన  తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకి నేలలో ఏ ఏ పోషకాలు ఎంత స్థాయిలో ఉన్నాయి నేలకి ఇంకా ఎంత వేయాలి అనేది రైతులకు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు డి నిర్మల  మరియు మండల వ్యవసాయ అధికారి గారు షేక్ జైనులుబ్దిన్  మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.